& News Govt jobs

భాగ్యనగరంలో సొరంగ మార్గం వచ్చేస్తోంది !

0

భాగ్యనగరంలో విభిన్న రకాల రహదారులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఆకాశ మార్గాలు, పైవంతెనలు, దుర్గం చెరువుపై వేలాడే వంతెన రోడ్డు, బీఆర్‌టీఎస్‌ వంటి పలు రకాల రహదారుల పనులు మొదలైన విషయం తెలిసిందే. తాజాగా ఇనార్బిట్‌ మాల్‌ వైపు నుంచి ఖాజాగూడ కూడలి వరకు సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే నగరంలోని రహదారులు విదేశాలను తలదన్నేలా ముస్తాబు కానున్నాయి.

hyd-top1a

ట్రాఫిక్‌ కష్టాలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాటితోపాటు నగరంలోనే అనేక రకాల రహదారులపై ప్రయాణించామనే అనుభూతిని నగరవాసులు సొంతం చేసుకోనున్నారు. పర్యాటకమూ కొత్త కళ సంతరించుకోనుంది. మహా నగరం పరిధిలో రహదారులను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సమగ్ర రహదారి అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) కింద ఐదు దశల్లో పనులు చేపట్టేందుకు నిర్ణయించిన బల్దియా, ఎల్‌బీనగర్‌, కేబీఆర్‌ పార్కు ప్రాంతాల్లో ప్రారంభించింది.

ఆ ప్రాజెక్టు పూర్తయితే ప్రధాన రహదారులకు సమాంతరంగా ఆకాశ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రజా రవాణాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన బీఆర్‌టీస్‌కు కూడా జీహెచ్‌ఎంసీ తాజాగా పచ్చజెండా వూపింది. బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఆర్‌టీసీ బస్సులు ఆగి, ఆగి ప్రయాణించే దుస్థితి పోతుంది. ట్రాఫిక్‌ చక్రబంధంలో ఇరుక్కోకుండా ప్రయాణికులు వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని అధికారులు అంటున్నారు.

ఈ రోడ్లపై ఆర్‌టీసీ బస్సులకు ప్రత్యేకించిన మార్గం ఉంటుంది. అందులో ప్రైవేటు వాహనాలకు ప్రవేశం ఉండదు. బస్టాపులూ రోడ్డు మధ్యలోనే ఉంటాయి. ఇక దుర్గం చెరువు వద్ద చేపట్టిన వూగే వంతెన నిర్మాణం నగరానికి మరో కొత్త అందాన్ని తీసుకొస్తుందనే చెప్పాలి. రూ.184కోట్లతో నిర్మాణంకానున్న ఈ వంతెన పొడవు 230 మీటర్లు. వెళ్లే వాహనాలకు మూడు లేన్లు, వచ్చే వాహనాలకు తదుపరి మూడు లేన్లను రవాణాకు కేటాయిస్తారు. పాదచారులు సైతం వంతెనపై ఉండే ఫుట్‌పాత్‌పై నడుస్తూ దుర్గం చెరువు అందాలను వీక్షించే సదుపాయం ఉంటుంది. ఎల్‌అండ్‌టీ సంస్థ దాన్ని నిర్మించనుంది. 2019కి ఈ వంతెన అందుబాటులోకి వస్తుందని అధికారుల అంచనా. దాని వల్ల హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టులన్నికీ నిధుల సమీకరణ ఎలా అనే అంశంపై మాత్రం అధికారుల్లో స్పష్టత లేదు.
కేబీఆర్‌ పార్కు చుట్టూ.. ప్రస్తుతం కేబీఆర్‌ పార్కు చుట్టూ కొన్ని రోడ్లు విస్తారంగా ఉండగా, కొన్ని తక్కువ వెడల్పుతో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారులు చేపట్టిన రహదారి అభివృద్ధి పనులతో పార్కు చుట్టూ ఉండే రోడ్లన్నీ 120 అడుగుల వెడల్పుతో ప్రయాణానికి సిద్ధం కాబోతున్నాయి. ప్రస్తుతం జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 92 వెడల్పు 100 అడుగులు ఉండగా, దాన్ని 120 అడుగులకు విస్తరిస్తామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. అలాగే 80 అడుగుల వెడల్పున్న బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌-2, 10, 12, 14, జూబ్లిహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌-45లూ 120 అడుగులకు మారనున్నాయి. ఇక ఫిల్మ్‌నగర్‌ రోడ్డు, జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌-36 రోడ్డు ఇప్పటికే 120 అడుగుల వెడల్పుతో ఉన్నాయి. ఈ ఎనిమిది రోడ్ల విస్తరణ పనులు పూర్తయితే కేబీఆర్‌ పార్కు చుట్టూ 120 అడుగుల వెడల్పుండే రోడ్లు అందుబాటులోకి వస్తాయి. హైటెక్‌ సిటీ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి.

300 మీటర్ల సొరంగ మార్గం

అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఇనార్బిట్‌మాల్‌ వరకు దుర్గం చెరువుపై వేలాడే వంతెన నిర్మాణం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న రహదారిని పొడిగించి ఖాజాగూడ కూడలి వద్దకు రోడ్డు వేయాలనేది జీహెచ్‌ఎంసీ ప్రతిపాదన. ఈ పనులు పూర్తవ్వాలంటే అడ్డుగా ఉండే పెద్ద రాతి కొండను తొలగించాలి. అందుకోసం సుమారు 300 మీటర్లు తవ్వాల్సి ఉంటుంది. అయితే పెద్దపెద్ద బండరాళ్లు, చక్కని పచ్చదనంతో ఆ కొండ హైటెక్‌ సిటీ వైపు నుంచి అందంగా కనిపిస్తుంటుంది. దాంతో దాన్ని తొలిచి రోడ్డు నిర్మించడంపై అధికారుల్లో భిన్న వాదనలు వచ్చాయి.

ఫలితంగా జీహెచ్‌ఎంసీ సొరంగ మార్గం నిర్మించేందుకు మొగ్గు చూపింది. మంత్రి కేటీఆర్‌ అంగీకారం తెలిపినట్లు బల్దియా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ రోడ్డుతో హైటెక్‌ సిటీ, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌ల నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వెళ్లేవారు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఖాజాగూడ కూడలి నుంచి దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ మీదుగా నేరుగా గమ్యాన్ని చేరుకునే సౌలభ్యం వస్తుంది.

Leave A Reply

Your email address will not be published.